Mulugu Workers Protest
* కేంద్రం ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోవాలి
* నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
* రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
ఆకేరు న్యూస్, ములుగు:
కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ తో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు .ఈ సందర్భంగా అంగన్వాడి రాష్ట్ర కార్యదర్శి కే సమ్మక్క , రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 29 రకాల కార్మిక చట్టాలను రద్దుపరిచి నూతనంగా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు సమ్మె చేసే హక్కు కనీస వేతనం లేకుండా కార్మిక వ్యతిరేక విధానాలు ఆలంబిస్తుందని ఆరోపించారు . స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో అమెరికా బ్రిటన్ న్యూజిలాండ్ దేశాలతో వ్యవసాయ రంగ ఉత్పత్తులు జీరో టారిఫ్ తో దిగుమతులకు అవకాశం ఇచ్చి, ఆ దేశాలు మాత్రం మన వ్యవసాయ ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తూ మన వ్యవసాయ రంగాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
ఉపాధి హామీ చట్టాన్ని రద్దుపరిచి వి బి జి రాంజీ పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం జరిగిందని ఇందులో కేంద్ర ప్రభుత్వం 60% రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాలంటే అనేక రాష్ట్రాలు ఈ పథకానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని ,ఈ పథకాన్ని రద్దుపరిచి పాత విధానంలో ఉపాధి హామీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అల్లెం అశోక్, ఊకే నాగేశ్వరరావు, దాసరి కృష్ణ, అంగన్వాడి జిల్లా నాయకులు రుక్మిణి ,ఆశ కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చిట్టినేని శ్రీనివాస్, ఎర్రోజు సత్యనారాయణ,అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పురెందుల సమ్మక్క ,సరిత, రుక్మిణి, నిర్మల,తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
