Hanamkonda Farmers Protest
* నాయకుల అరెస్ట్‌తో ఉద్రిక్తత
* హన్మకొండ కలెక్టర్ బంగ్లా సెంటర్లో భారీ ఆందోళన..
అకేరు న్యూస్ హన్మకొండ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం హన్మకొండలో ఆందోళనకు దిగాయి. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బంగ్లా సెంటర్లో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై బైఠాయించిన రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించడంతో ఆందోళన విరమించింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వదేశీ విధానాల పేరుతో కేంద్ర ప్రభుత్వం విదేశాలకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా దేశీయ వ్యవసాయ రంగం, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లోకి పెద్దఎత్తున ప్రవేశిస్తే భారత రైతాంగంపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రుణ విముక్తి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతాంగ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.
అదేవిధంగా కేంద్ర విద్యుత్, విత్తన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రైతులు, కార్మికులు, ప్రజలను కలుపుకొని మరింత పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పల వీరయ్య అధ్యక్షత వహించారు. ఎస్కేఎం జిల్లా కన్వీనర్లు ప్రభాకర్‌రెడ్డి, ఎన్.రెడ్డి హంసారెడ్డి, కౌడగాని శివాజీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్తో పాటు మాస్ సావిత్రి, ప్రేమలత, రజిత, రాములు, వెంకట్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
