Free Heart Surgery for Children, NIMS Hyderabad
* ఈ నెల 13 నుంచి నిమ్స్‌లో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయనున్నారు. నిపుణులైన వైద్య బృందం పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైతే ఆపరేషన్లు చేసేందుకు ఆస్పత్రి సిద్ధమైంది. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 13 నుంచి ఆస్పత్రిలో చికిత్సలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
* నేరుగా వచ్చి..
గురువారం నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని, అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఉచితంగా సేవలు అందిస్తామన్నారు.
* ఉదయం 8 గంటల నుంచి..
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిమ్స్ పాత బ్లాక్, మొదటి అంతస్తులోని సీటీ సర్జరీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహిస్తారు. అర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండా, నిర్ణీత సమయాల్లో ఆస్పత్రికి రావచ్చు. నిపుణులైన వైద్యులు అక్కడ అందుబాటులో ఉంటారు.
* లండన్ వైద్యులు..
నిమ్స్ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సల సేవలను అందిస్తున్నట్లు ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. లండన్ వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలుకు 040-23489025 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు. అవసరమైన వారు అందుబాటులో ఉంటే గతంలో చేయించిన వైద్య పరీక్షలు, పాత వైద్య నివేదికలతో సంప్రందించాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
