Hyderabad Drunk Driving Counselling
* రోడ్డు ప్రమాద దృశ్యాలు చూపుతూ అవగాహన
* మద్యం మత్తు ఎలా చిదిమేసిందో చూశారా?
* మందుబాబులకు పోలీసుల కౌన్సిలింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
‘‘ఆ పెద్దాయనను చూశారా? పాపం ఆయనకు ఏం సంబంధమూ లేదు. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనం నడుపుతున్నాడు. ఇంతలో చూడండి ఎలా దూసుకొస్తున్నాడో.. మందు మైకంలో.. వాహనం ఎలా నడుపుతున్నాడో కూడా తెలియని లోకంలో ఉన్నాడు. ఆ పెద్దాయనను ఢీకొట్టేశాడు. ఈ ప్రమాదంలో ఆయనా చనిపోయాడు. మందు తాగి వీడూ చచ్చాడు’ అంటూ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిందితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇతర వాహనదారులకూ అవగాహన కలిగిస్తున్నారు.
* ఆ కుటుంబసభ్యుల పరిస్థితి గుర్తించండి..
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే ఏం జరుగుతుందో, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో గుర్తించండి అంటూ మల్కాజిగిరి టీటీఐ ఇన్స్పెక్టర్ అర్జున్ రాచూడి అన్నారు. ప్రమాద దృశ్యాలను వాహనదారులకు వీడియోలు చూపుతున్నారు. దిల్సుఖ్నగర్లోని టీటీఐ లెక్చర్ హాల్లో ఆయన ఎస్పీఓలు అమరవర్ధన్రెడ్డి, అల్లూరయ్యలతో కలిసి 69 మంది మందుబాబులకు, ఇద్దరు నెంబర్ ప్లేట్ నిబంధన అతిక్రమించిన వారికీ 71 కుటుంబ సభ్యుల సమక్షంలో 7 విడతలుగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
* ప్రాణాలు తీస్తున్నారు..
మద్యం మత్తులో వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాల్లో ఇతరులూ ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. కొందరు దివ్యాంగులై దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, ఉపాధి కోల్పోయే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. మత్తులో డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదాల వాస్తవాలు గ్రహించాలని సూచించారు. వాహనాల నెంబర్ ప్లేట్లను వంచేయడం, నెంబర్ కనబడకుండా దాచేయడం నేరమన్నారు. వాహనాల నెంబర్ నేరాల/ ప్రమాదాల దర్యాప్తులో ప్రధాన పాత్ర పోషిస్తాయనీ తెలిపారు. సిబ్బంది రవి ప్రమాదాల వీడియోలు ప్రదర్శించారు.
* 978 వాహనదారులకూ అవగాహన
సికింద్రాబాద్, సంగీత్ చౌరస్తా, శివాజీనగర్, కొత్తపేట హుడా జంక్షన్, సరూర్నగర్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు తదితర 13 ప్రాంతాల కూడళ్లలో టీటీఐ ఎస్ఐ కే.రవికుమార్ వివిధ వాహనాల డ్రైవర్లకూ ట్రాఫిక్ నిబందనలపై అవగాహన కల్పించారని ఇన్స్పెక్టర్ అర్జున్ రాచపుడి తెలిపారు. వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా సిగ్నల్ వ్యవస్థ రూపొందించారని గుర్తు చేశారన్నారు. వేగపరిమితి పాటించడం ప్రమాదాల నివారణకు ప్రధానమని అధికారులు పేర్కొన్నారన్నారు. సిబ్బంది నర్సింగ్, సీహెచ్.రవికుమార్ 978 మంది వాహనదారులకు నిబంధనల కరపత్రాలు పంపిణీ చేశారన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
