Minister Seethakka Mulugu Women Entrepreneurs
* ములుగు పర్యాటక సంపద మహిళల ఆర్థికాభివృద్ధికి అవకాశాల గని
* మహిళా వ్యాపారాలకు కొత్త దిశగా ‘ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్’
ఆకేరు న్యూస్,ములుగు:
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సహాయక సంఘాల సభ్యులను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని,స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని,మహిళా వ్యాపారాలకు కొత్త దిశగా ఇంక్యుబేటర్ కార్యక్రమం నూతన వేదికగా మారుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ తెలంగాణ ఆధ్వర్యంలో బిట్స్ పిలానీ హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ అవగాహన, ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబం బాగుపడుతుందని, కుటుంబాలు బాగుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళల సామర్థ్యంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అపారమైన నమ్మకం ఉందని, అందుకే మహిళా సంఘాలకు వివిధ వ్యాపార, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తోందని, ములుగు జిల్లాలో ఇప్పటివరకు సుమారు రూ.13 కోట్ల వడ్డీ మొత్తాన్ని మహిళలకు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు.ప్రజల కోసం పోరాడి వనదేవతలుగా కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ మహిళలందరికీ గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు.
మహిళలు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. బిట్స్ పిలానీ సహకారంతో అందించే శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలం నుంచి వ్యాపారం పట్ల ఆసక్తి, వినూత్న ఆలోచనలు కలిగిన మహిళలను గుర్తించి శిక్షణకు ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ములుగు జిల్లాలోని అపారమైన ప్రకృతి, పర్యాటక సంపదను మహిళల ఆర్థికాభివృద్ధికి అనుసంధానం చేయాలని మంత్రి సూచించారు. మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ, రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, గోదావరి తీరం, దట్టమైన అడవులతో జిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్లు, మొబైల్ టిఫిన్ కేంద్రాలు, స్థానిక ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానికంగా లభించే ఇప్పపువ్వు, అరటి, మిరప తదితర ఉత్పత్తులకు విలువ జోడించి ప్యాకేజింగ్, మార్కెటింగ్ చేయడం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
ములుగు జిల్లా భవిష్యత్తులో ప్రధాన పర్యాటక, విద్యా, వైద్య కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, సమ్మక్క–సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో జిల్లాలో వ్యాపార అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు రూ.1 కోటి 50 లక్షల తో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా, మరికొందరికి ఉపాధి కల్పించే శక్తిగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, డీఆర్డీఓ రవీందర్, బిట్స్ పిలానీ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కృష్ణ,జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్,ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె. అనూష, డీపీఎంలు, ఏపీఎంలు, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
