Konda Murali Plan B
* సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం
* మేము కాంగ్రెస్ లోనే కొనసాగుతాం
* ఓ బిల్లు విషయంలో బట్టిని కలిసా
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ దంపతుల వ్యవహారశైలి, వారి కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ, సీనియర్ నేత కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కమిటీ పీసీసీకి నివేదిక సమర్పించిన నేపథ్యంలో, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
* పార్టీ వీడేది లేదని స్పష్టత..
హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమైన అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీని వీడుతోందంటూ వస్తున్న ప్రచారాలను ఆయన పూర్తిగా ఖండించారు. “కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. వివాదాల నేపథ్యంలో నేటికీ నేను వరంగల్ కూడా వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉన్నాను” అని పేరొకన్నారు.
* ‘మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం?’..
తన కుమార్తె సుస్మిత పార్టీపై, నాయకత్వంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ — “ఆ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దానిపై నేను మాట్లాడను” అని తేల్చి చెప్పారు. తన కూతురికి స్వతంత్ర ఆలోచనలు ఉంటాయని, ఆమె ప్లాన్స్ తనకెలా తెలుస్తాయని ప్రశ్నించారు. “సుస్మిత ఇప్పటివరకు మాట్లాడింది ‘ప్లాన్-A’ కావచ్చు. కానీ ‘ప్లాన్-B’లో ఆమె ఏం చేస్తుందో, ఏం ఆలోచిస్తుందో నాకూ తెలియదు” అని మురళి వ్యాఖ్యానించారు.
* రాజకీయ ప్రాధాన్యం లేదన్న నేత..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదా సుస్మిత వ్యాఖ్యల చర్చ లేదని, కేవలం యోగక్షేమాలు తెలుసుకునేందుకే కలిశానని మురళి చెప్పారు. అయితే, క్రమశిక్షణా కమిటీ నివేదిక అధిష్ఠానం వద్దకు చేరిన కీలక సమయంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
