Kalvakuntla Kavitha ties thaali in a Wedding Ceremony
* పార్టీ నాయకుడి కోరిక నెరవేర్చిన కవిత..
* సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం పోసి ఆశీర్వచనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వివాహ వేడుకలో ఇంటి ఆడబిడ్డగా మారి ఆత్మీయతను చాటుకున్నారు. తన పార్టీ నాయకుడి కోరిక మేరకు ముదిరాజ్ కులాచారం ప్రకారం ఆడపడుచు హోదాలో నిలిచి, వధువు మెడలో పసుపు కొమ్ము దారంతో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్ సమీపంలోని ఈసీఐఎల్ – కీసర క్రాస్ రోడ్డులో ఉన్న ఆరాధ్య కన్వెన్షన్ ఈ అరుదైన, ఆసక్తికరమైన ఘట్టానికి వేదికగా నిలిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ జాగృతి సంస్థలోనూ చురుగ్గా పనిచేశారు. బాలప్రసాద్‌కు సీతాఫల్‌మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయమైంది. అయితే, బాలప్రసాద్‌కు సొంత సోదరీమణులు (అక్కాచెల్లెళ్లు) లేకపోవడంతో తన వివాహాన్ని కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా, తమ ఇంటి ఆడబిడ్డ హోదాలో జరిపించాలని ఆయన ఆమెను ఆకాంక్షించారు. నాయకుడి అభిమానాన్ని గౌరవించిన కవిత ఈ ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించి వేడుకకు హాజరయ్యారు.
ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ప్రధాన మంగళసూత్ర ధారణకు ముందు, వరుడి సోదరి (ఆడపడుచు) వధువు మెడలో పసుపు కొమ్ము దారాన్ని తాళిగా భావించి మూడు ముళ్లు వేయడం ఆనవాయితీ. ఈ కులాచారం మేరకు కవిత గౌరీ పూజలో పాల్గొని, వధువు శివాని మెడలో పసుపు కొమ్ము దారంతో మూడు ముళ్లు వేసి, ప్రదానపు ఉంగరాన్ని తొడిగారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం పోసి నూతన వధువును ఆశీర్వదించారు. కవిత తన పాత్రను పూర్తి చేసిన తర్వాత, వరుడు బాలప్రసాద్ వధువుకు మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో వరుడి తల్లిదండ్రులు స్వరూప-బాలకృష్ణ, సోదరుడు నాగరాజుతో పాటు తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
