MLC Baswaraju Saraiah on Konda Surekha
* ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి
* సీఎంను విమర్శిస్తే ఊరుకోం.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సవాల్
* కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ వేడి
ఆకేరు న్యూస్, వరంగల్ జిల్లా: కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కొండా సురేఖపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే తాను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమని ఎమ్మెల్సీ సారయ్య స్పష్టం చేశారు. ప్రజలే ఎవరి వెంట ఉన్నారో ఎన్నికల్లో తేల్చుకుందామని ఆయన సవాల్ చేశారు. కొన్నేళ్లుగా ప్రజలను రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించిన సారయ్య, ఇప్పుడు బీసీ కార్డును ఉపయోగించుకుని రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖపై విమర్శలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సారయ్య హెచ్చరించారు. కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన వారిలో తాను కూడా ఉన్నానని వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
కొండా వర్గంపై తీవ్ర ఆరోపణలు చేసిన సారయ్య, రాజకీయాల్లో బ్లాక్మెయిల్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అలాగే 250 మూగజీవాల మృతి ఘటనపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ఘటన జరిగిన స్థలానికి సంబంధించిన భూమి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సారయ్య చేసిన ఈ వ్యాఖ్యలు వరంగల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంతో కాంగ్రెస్‌లో రాజకీయ వేడి కొనసాగుతుండగా, తాజాగా ఎమ్మెల్సీ సారయ్య నేరుగా సవాల్ విసరడంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
