Corneal Blindness India Eye Donation
* దేశంలో 20 లక్షల మంది కార్నియా బాధితులు
* 60 శాతం మంది చిన్నారులే
* నేత్రదానానికి ముందుకు రావాలని ఎల్వీ ప్రసాద్ సంస్థ పిలుపు
* నేత్రదాన పక్షోత్సవాల్లో కీలక వివరాలు వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలో లక్షలాది మంది జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. చూపు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కార్నియా దెబ్బతినడం వల్ల దృష్టి కోల్పోయినవారికి నేత్రదానం ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని వైద్యులు చెబుతున్నారు. అయినా దీనిపై అవగాహన లేక చాలా మంది ముందుకు రావడం లేదు. డిమాండ్‌కు తగినంతగా నేత్రదానాలు జరగకపోవడం, సమాజంలో నేటికీ సరైన అవగాహన లేకపోవడంతో వేలాది మంది చీకట్లోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ (ఎల్వీపీఈఐ) దీనిపై అధ్యయనం చేసింది. కీలక వివరాలు వెల్లడించింది. ఈక్రమంలో కంటి సమస్యలకు సంబంధించి దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర కథనం..
* వేలాది మందికి అంధత్వం..
చీకటి జీవితంలో వెలుగులు నింపే అత్యంత పవిత్రమైన కార్యం ‘నేత్రదానం’. బతికి ఉన్నప్పుడు సాయం చేయలేని పరిస్థితి ఉన్నా, మరణించాక కూడా మరొకరి జీవితాన్ని మార్చవచ్చని నిరూపించే మహత్తర కానుక ఇది. అయితే, నేటి నవయుగంలోనూ నేత్రదానాలపై అవగాహన లోపించడం, మూఢనమ్మకాలు వెంటాడటంతో దేశంలో వేలాది మంది అంధత్వంలోనే మగ్గుతున్నారు.
* 60 శాతం మంది చిన్నారులే..
ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వెల్లడించిన ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో సుమారు 20 లక్షల మందికి పైగా కార్నియా సంబంధిత అంధత్వంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారుణమైన విషయమేమిటంటే, ఈ బాధితుల్లో దాదాపు 60 శాతం మంది 12 ఏళ్లలోపు ఉన్న చిన్నపిల్లలే! కంటి వ్యాధులు, ఊహించని గాయాలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కార్నియా తన పారదర్శకతను కోల్పోవడంతో వీరు శాశ్వతంగా దృష్టి కోల్పోతున్నారు. ఈ చిన్నారుల ప్రపంచంలో మళ్లీ రంగుల వెలుగులు నింపాలంటే కార్నియా మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని వైద్యులు ధ్రవీకరించారు.
* నాలుగో వంతు మాత్రమే..
భారతదేశంలో ప్రస్తుతం లభిస్తున్న దాతల కార్నియాలు అవసరంలో ఉన్న రోగులలో కేవలం 25 శాతం అంటే నాలుగో వంతు)మందికి మాత్రమే సరిపోతున్నాయని ఎల్వీ ప్రసాద్ సంస్థ వెల్లడించింది. మిగిలిన 75 శాతం మంది దాతల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. 1989 నుంచి నేత్ర నిధి సేవలు అందిస్తున్న ఎల్వీపీఈఐ నెట్వర్క్ ఇప్పటివరకు 1,70,626 కు పైగా దాతల కార్నియాలను సేకరించి ఎందరో జీవితాల్లో కాంతిని నింపింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొన్ని ప్రధాన ఐ బ్యాంకుల గణాంకాలు ఇలా ఉన్నాయి.
* హైదరాబాద్ లోని రామాయమ్మ ఐ బ్యాంక్ : 1,23,802 సేకరణ – 71,154 పంపిణీ
* భువనేశ్వర్ లోని దృష్టి దాన్ ఐ బ్యాంక్ : 21,795 సేకరణ – 18,123 పంపిణీ
విశాఖపట్నం లోని మొహ్సిన్ ఐ బ్యాంక్) : 16,573 సేకరణ – 9,217 పంపిణీ
విజయవాడ లోని టీకే ఐ బ్యాంక్) : 8,117 సేకరణ – 4,560 పంపిణీ
కడప లోని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఐ బ్యాంక్ : 339 సేకరణ – 128 పంపిణీ
ఆసుపత్రుల్లో ఓదార్పు గుండెలు.. దానానికి అడుగులు
* ఎల్వీపీఈఐ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు
బాధితుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు హాస్పిటల్ బేస్డ్ కార్నియా రిట్రీవల్ ప్రోగ్రామ్ ద్వార ఎల్వీపీఈఐ ప్రత్యేక కృషి చేస్తోంది. ఆసుపత్రుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలర్లు ధైర్యం చెబుతూ, నేత్రదానం గొప్పతనాన్ని వివరిస్తున్నారు. వారి మాటలకు స్పందించి అనేకమంది పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానానికి అంగీకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేత్రదానం అనేది వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ కాబట్టి కుటుంబ సభ్యుల సమ్మతి అత్యంత కీలకమని రామాయమ్మ ఐ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీత చౌరాసియా వివరించారు. “నేత్రదానం చేయాలనుకునే ప్రతి ఒక్కరూ తమ సంకల్పాన్ని బతికుండగానే తమ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పాలి. అప్పుడే మరణానంతరం మీ కోరికను వారు నిరభ్యంతరంగా నెరవేర్చగలుగుతారు” అని ఆమె సూచించారు.
* మన కళ్లు మట్టిలో కలిసిపోయేకంటే..
రణం తర్వాత మన కళ్లు మట్టిలోనో, బూడిదలోనో కలిసిపోవడం కంటే మరొకరి జీవితంలో చీకట్లను తుడిచేసి వెలుగులు నింపడం కంటే మిన్నయైన దానం మరొకటి లేదు. ఈ లోకంలో చూపు లేక నిరంతరం చీకటి ప్రపంచంలో మగ్గుతున్న వేలాది మందికి, ముఖ్యంగా చిన్నతనంలోనే దృష్టి కోల్పోయిన పసిపిల్లలకు నేత్రదానం ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి చేసే నేత్రదానం ఇద్దరి జీవితాల్లో కాంతులు నింపగలదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
