Tella Kagitham Movie Teaser Launch event
* అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ‘తెల్ల కాగితం’. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందు సవిరిగాన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఇప్పటికే సినిమాపై మంచి హైప్ ఏర్పడగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బాబీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
* అమాయకమైన ప్రేమకథ
టీజర్ లాంచ్ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. జీవితంలో తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తుంటారని, ఆ భావన చుట్టూనే ‘తెల్ల కాగితం’ కథ సాగుతుందని తెలిపారు. తెల్ల కాగితంపై ఎర్ర మచ్చ పడితే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఈ కథ రూపొందిందన్నారు. 2000 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే అమాయకమైన ప్రేమకథగా సినిమాను తెరకెక్కించారని, హర్ష్ రోషన్, నక్షత్రతో పాటు మరో ఇద్దరు స్నేహితుల మధ్య కథ నడుస్తుందని చెప్పారు. సినిమాలోని అమాయకత్వాన్ని నందు అద్భుతంగా రాశారని, రమేష్ చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు. కె.వి. గుహన్ విజువల్స్, విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయని అన్నారు.
యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కు కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇదని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రస్తుత తరం తమ జీవితంలో ‘తెల్ల కాగితం’పై ఎర్ర మచ్చ పడకుండా జాగ్రత్తగా ఉండాలనే సందేశం ఇందులో ఉందన్నారు. నిర్మాత కృష్ణతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, సినిమా విజయానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
* బ్లాక్‌బస్టర్ ఎలిమెంట్స్ ఉన్నాయి
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. నిర్మాత కృష్ణ, రచయిత నందుతో ఉన్న అనుబంధంతో ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. షూటింగ్‌కు ముందే కథ విన్నానని, ఇది ఇన్నోసెంట్ లవ్‌స్టోరీతో పాటు చాలా లేయర్స్ ఉన్న కథ అని చెప్పారు. బ్లాక్‌బస్టర్ సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హర్ష్ రోషన్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారని, నక్షత్రకు తెలుగులో మంచి స్వాగతం లభించాలని కోరుకున్నారు. దర్శకుడు రమేష్ తొలి ప్రయత్నంలోనే మంచి లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారని, విజయ్ బుల్గానిన్ సంగీతం ఆకట్టుకుందని బాబీ అన్నారు.
* మంచి కంటెంట్‌పై నమ్మకం
బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘తెల్ల కాగితం’ కథ గురించి చాలా కాలంగా వింటున్నానని తెలిపారు. చాలామంది చేయాలనుకున్న ఈ కథ ఇప్పుడు సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. నిర్మాత కృష్ణకు నిర్మాణం, పబ్లిసిటీని సమర్థంగా నిర్వహించే అనుభవం ఉందని, ఆయన నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పలువురు సినీ ప్రముఖులు ఇచ్చిన మద్దతు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ‘తెల్ల కాగితం’ కేవలం సినిమా కాదని, మంచి ఫీలింగ్ అని చెప్పారు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన ప్రతి ఒక్కరూ ఈ కథతో కనెక్ట్ అవుతారని హర్ష్ రోషన్ అన్నారు. ఇది ప్యూర్, ఇన్నోసెంట్, ఎమోషనల్ లవ్‌స్టోరీ అని, సినిమాను చూడటం కంటే ఫీల్ అవ్వాలని కోరారు. తన వయసుకు, కెరీర్‌కు సరైన సమయంలో ఇలాంటి కథ రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
‘7జీ బృందావన్ కాలనీ’, ‘ప్రేమిస్తే’ తరహాలో ‘తెల్ల కాగితం’ కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే ప్రేమకథ అవుతుందని, అక్టోబర్ 2న సినిమా చూసి ప్రేక్షకులు మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారని హర్ష్ రోషన్ ధీమా వ్యక్తం చేశారు.
* ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు
దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని దశలు ఉంటాయని, ‘తెల్ల కాగితం’లో చూపించే దశను అందరూ ఏదో ఒక సమయంలో దాటి వచ్చుంటారని అన్నారు. కథ బలంగా ఉంటుందని, ప్రేక్షకులు రిలేట్ అవుతారని చెప్పారు. పాటలతో పాటు అన్ని అంశాలు చక్కగా కుదిరాయని, బ్లాక్‌బస్టర్ అందుకుంటామనే నమ్మకం ఉందన్నారు.
నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్, దీపక్, శ్రావ్య తదితరులు నటిస్తున్నారు. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, చిన్నా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. ‘తెల్ల కాగితం’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
