GWMC Commissioner T. Venkanna Warangal Ganesh Chaturthi Arrangements
* వినాయక చవితికి ఈనెల 13లోగా ఏర్పాట్లు పూర్తి కావాలి
* జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
* వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష
ఆకేరు న్యూస్, వరంగల్ : వినాయక చవితికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లపై కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండగ నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేందుకు పలు సూచనలు చేశారు.వినాయక చవితితో పాటు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పారిశుధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు, తాగునీటి వసతి, చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, క్రేన్లకు ఇంధన సరఫరా తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
* 13వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి
సెప్టెంబర్ 13వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గణేష్ విగ్రహాలు తరలించే ప్రధాన మార్గాల్లో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చాలని, ఇతర మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరం చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన చోట మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక మండపాల వద్ద ప్రత్యేక చెత్త బిన్లు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని, శానిటరీ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో మండపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
* ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు ఉండొద్దు..
నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఆరఎఫ్, రెస్క్యూ, మత్స్య శాఖ సిబ్బంది బోట్లతో సిద్ధంగా ఉండాలని కమిషనర్ సూచించారు. అలాగే హార్టికల్చర్ విభాగం సమన్వయంతో విగ్రహాలు తరలించే మార్గాల్లో వాహనాల”, భక్తులకు ఇబ్బంది కలిగించే పెద్ద చెట్ల కొమ్మలను ముందుగానే తొలగించాలన్నారు.
* సిబ్బంది సమన్వయంతో పని చేయాలి
పండగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని, అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం లేకుండా అంకితభావంతో పూర్తి చేయాలని కమిషనర్ టి.వెంకన్న స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, అగ్నిమాపక జిల్లా అధికారి శంకర్లింగం, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్ కుమార్, ఆరోగ్య అధికారి డా. రాజేష్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
