* కడియం శ్రీహరిపై దాస్యం వినయ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హనుమకొండ :
హనుమకొండలో బీఆర్ఎస్ భారీ నిరసన, రాస్తారోకో.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సబ్బండ వర్గాలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, సహించలేని రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు పాల్పడుతోందని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు 420 హామీలను అమలు చేయడంలో సంపూర్ణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ వైఫల్యాలపై భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి నిరసనగా రాస్తారోకో చేపట్టి, రేవంత్ రెడ్డి సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
* 1000 రోజుల విఫల పాలనపై దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తన 1000 రోజుల పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని 1000 రెట్లు వెనక్కి నెట్టారని తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, 1000 రోజులు దాటినా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను పూర్తిగా విస్మరించడంతో ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు బయలుదేరిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ నెల 2వ తేదీ నుంచి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
* అన్ని వర్గాలకూ అన్యాయం, మహిళా ఎమ్మెల్యేలపై దాడులు దుర్మార్గం
ప్రస్తుతం విద్యార్థుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి పాలనను అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, యువతకు ఉద్యోగాలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మరియు వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందించడంలో రేవంత్ సర్కార్ తీవ్రంగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దేశంలో, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.
* కడియం శ్రీహరి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపాటు
నిన్న అసెంబ్లీ వేదికగా సీనియర్ నాయకులు కడియం శ్రీహరి చేసిన ఉపన్యాసం అత్యంత హాస్యాస్పదంగా ఉందని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారు దళితులను పట్టించుకోలేదనడం విడ్డూరంగా ఉందని అన్నారు. “అయ్యా శ్రీహరి గారు, మీరు ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చుంటే, గల్లీలో ఉన్న మిమ్మల్ని తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టింది కేసీఆర్ గారు కాదా? దళిత నాయకుడైన మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చేసింది కేసీఆర్ గారు కాదా?” అని ఘాటుగా ప్రశ్నించారు. సాటి దళితుడని కూడా చూడకుండా లేనిపోని అభాండాలు వేసి, రాజయ్యను కించపరిచి ఆయన డిప్యూటీ సీఎం పదవికే ఎసరు పెట్టిన కన్నింగ్ నాయకుడు కడియం శ్రీహరి అని తీవ్రంగా విమర్శించారు.
* కేసీఆర్ దళిత బాంధవుడు – కడియం వైఖరి సిగ్గుచేటు
ఆనాడు తన గురువు చంద్రబాబు నాయుడి వద్ద మొకరిల్లి దళిత ఉద్యమాన్ని నీరుగార్చిన చరిత్ర కడియందేనని ఆరోపించారు. దళితులపై ఉన్న అపారమైన ప్రేమతో కేసీఆర్ గారు చారిత్రాత్మక ‘దళిత బంధు’ పథకాన్ని అందించి వారిని ఆర్థికంగా నిలబెట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 12 లక్షల దళిత బంధు సహాయంపై నిన్న అసెంబ్లీలో కడియం శ్రీహరి ప్రస్తావిస్తారని ఆశిస్తే, దళితులను ధనవంతులను చేసిన కేసీఆర్ గారిపైనే విమర్శలు చేయడం అత్యంత విచారకరమని, సిగ్గుచేటని హితవు పలికారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
