Telangana Rice Mills Indefinite Strike
* తెలంగాణ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
* హైదరాబాద్ ధర్నాచౌక్ లో ధర్నా
అకేరు న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈనెల 11వ తేదీ నుంచి రైస్‌మిల్లులను నిరవధికంగా బంద్ చేస్తామని తెలంగాణ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉట్కూరి వీరేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* దాడులను వెంటనే ఆపాలి
మిల్లర్లపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దాడులను వెంటనే ఆపివేయాలని, తనిఖీల పేరుతో కేసులు, జైలు శిక్షలు విధించడం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఒప్పందాన్ని ఇరువర్గాలకు అనుకూలంగా మార్చాలని, ధాన్యాన్ని టెస్ట్ మిల్లింగ్ చేసి ఔట్ టర్న్ ఆధారంగా న్యాయం చేయాలని కోరారు. అలాగే 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్‌పోర్టు, డ్రైయేజ్, కస్టడీ చార్జీల బకాయిలను విడుదల చేయాలని, మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీతో పాటు 12 శాతం వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
* రూ.80 వేల వరకు కరెంట్ బిల్లు
రైస్‌మిల్లులకు 200 హెచ్‌పీ వరకు ఎల్టీ కరెంట్ కేటగిరీ ఇవ్వాలని, భారీగా పెరుగుతున్న విద్యుత్ చార్జీల వల్ల నెలకు కనీసం రూ.80 వేల వరకు బిల్లులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం ఉత్పత్తి కోసం సార్టెక్స్ మిషన్ల వినియోగం పెరిగిందని, దీనివల్ల అదనంగా 50 హెచ్‌పీ విద్యుత్ అవసరమవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్ చార్జీలను క్వింటాలుకు రూ.10 నుంచి రూ.150కి పెంచాలని, ప్రతి ఏడాదీ రైస్‌మిల్లింగ్ అకౌంట్లు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
* సీఎం స్పందించాలి..
రైస్‌మిల్లింగ్ వ్యవస్థపై రైతులు, ట్రాన్స్పోర్టర్లు, డ్రైవర్లు, హమాలీలతో పాటు సాల్వెంట్, పౌల్ట్రీ తదితర పరిశ్రమలపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని వారు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించని పక్షంలో ఈనెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లులను నిరవధికంగా బంద్ చేస్తామని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
