Women Police Complaint
* తమతో అసభ్యంగా ప్రవర్తించడంపై ఆవేదన
* సీతక్క సీరియస్.. భరోసా ఇచ్చిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ వద్ద ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దాడిలో గాయపడిన బాధిత మహిళా పోలీసులను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ ఘటనలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, ఎదుర్కొన్న తీవ్ర అవమానాలను మహిళా పోలీసులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు.
* టీ షర్టులు విసిరేసి మీదికి వచ్చారు..
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తమ విధులు తాము నిర్వర్తిస్తుంటే బిఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారంటూ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో విజువల్స్ చూపించి మంత్రికి ఫిర్యాదు చేశారు. నిరసనల పేరుతో టీ షర్టులు విసిరేసి, తమ మీదికి దూసుకొచ్చారని, విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. అంతేకాకుండా, “తాము తిరిగి అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తాం” అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
* కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోంది..
ఘటనకు సంబంధించిన విజువల్స్, ఫోటోలు సోషల్ మీడియా మరియు మీడియాలో ప్రసారం కావడంతో తమ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మహిళా పోలీసులు తెలిపారు. ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతుండటంతో, ఇలాంటి డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదంటూ ఇళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని మంత్రికి వివరించారు.
* మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోలేదు..
మరోవైపు, బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల తాము ఎలాంటి దురుసుగా ప్రవాత్రిచలేదని వారు స్పష్టం చేశారు. వారిని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తుండగా, ఇతర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే వారిని వెళ్లకుండా ముందుకు నెడుతూ అడ్డుకున్నారని, ఆ క్రమంలోనే తోపులాట జరిగిందని వెల్లడించారు.
* సీతక్క హామీ…
మహిళా పోలీసుల ఫిర్యాదులు, విజువల్స్ పరిశీలించిన మంత్రి సీతక్క వారికి ధైర్యం చెప్పారు. “ఎవరి బెదిరింపులకూ భయపడాల్సిన అవసరం లేదు. మీ విధులను మీరు నిష్పక్షపాతంగా, ధైర్యంగా నిర్వహించండి. మహిళా సిబ్బందికి ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా అండగా ఉంటుంది” అని స్పష్టమైన భరోసానిచ్చారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారుల పట్ల అనాగరికంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
