Kondareddypally Power Protest
* రేవంత్ రెడ్డి సొంత ఊరిలోనే విద్యుత్ కోతలపై నిరసన
* శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై రైతుల ధర్నా
ఆకేరు న్యూస్, నాగర్కర్నూల్ : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా, వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ విద్యుత్ కోతలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాగునీటికి సరిపడా కరెంట్ అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక రైతులు పెద్దఎత్తున రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
* ఆరు గంటలే కరెంట్..
ప్రస్తుతం పొలాలకు కేవలం ఆరు గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పంట చేతికి వచ్చే కీలక సమయంలో కరెంట్ కోతలు విధించడం వల్ల బోర్ల నుంచి నీటిని తోడుకోలేకపోతున్నామని వాపోయారు. రూ. లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, సరిపడా నీరందక కళ్ల ముందే వేలాది ఎకరాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వేళల్లో కరెంట్ లేకపోవడం వల్ల వ్యవసాయ పనులన్నీ అస్తవ్యస్తమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.
* 24 గంటల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది?
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిరసనకారులు నిలదీశారు. సీఎం స్వగ్రామానికే నాణ్యమైన కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు.
* మోడల్ సోలార్ ఊరిలోనే విద్యుత్ లొల్లి..
గతంలో కొండారెడ్డిపల్లిని ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మోడల్ సోలార్ విలేజ్’గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. గ్రామంలో ఉన్న 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో సహా మొత్తం 1,451 వినియోగదారుల కోసం 100% సోలార్ ఆధారిత విద్యుత్ అందించేందుకు ఇంటింటి సర్వే కూడా నిర్వహించింది. అంతటి ప్రతిష్టాత్మక గ్రామంలోనే ఇప్పుడు కనీస వ్యవసాయ విద్యుత్ అందక రైతులు జాతీయ రహదారిపైకి రావడం గమనార్హం.
* హైవే దిగ్బంధం.. నిలిచిపోయిన రవాణా..
పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరకపోవడంతోనే జాతీయ రహదారిపై బైఠాయించామని రైతులు స్పష్టం చేశారు. రాస్తారోకో కారణంగా హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* హామీ ఇచ్చే వరకు కదిలేది లేదు..
అధికారులు వచ్చి మాటవరసకు సర్దిచెబితే కుదరదని.. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు. సీఎం సొంతూరులోనే రైతులు నిరసన జ్వాలలు ఎగిసిపడటం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
