Akbaruddin Owaisi, Indiramma Houses Details
* అసెంబ్లీలో అక్బరుద్దీన్ నిలదీత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో గృహనిర్మాణ పథకాలపై మజ్లిస్ (AIMIM) శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందరమ్మ హౌసింగ్ పథకం ద్వారా పేదలకు ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూనే, మైనారిటీలు మరియు ఇతర బలహీన వర్గాల హక్కులపై ఆయన ప్రశ్నలు గుప్పించారు.
* మైనారిటీలకు నిరంతరం అన్యాయం..
గతంలో పట్టాల పంపిణీ చేపట్టినా, లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించినా మైనారిటీలను ప్రతిసారి నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మైనారిటీలకు ఇళ్ల కేటాయింపుల్లో నిర్దిష్ట శాతం (కోటా) కేటాయిస్తూ ప్రత్యేక జీవో తెచ్చారని ఆయన సభకు గుర్తుచేశారు.
* 2 లక్షల ఇళ్ల వివరాల డిమాండ్..
ప్రభుత్వం ప్రస్తుతం 2 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొంటోందని, అయితే అందులో ఎవరెవరికి ఎన్ని ఇళ్లు కేటాయిస్తున్నారో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు లభించే ఇళ్ల సంఖ్యపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రతి వర్గానికి వారి హక్కు ప్రకారం ఇళ్లు అందేలా నిర్దిష్ట శాతాన్ని (Percentage) ఖరారు చేయాలని కోరారు.
* స్థానికేతరులకు కేటాయింపులపై అభ్యంతరం..
ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఇళ్లు నిర్మిస్తే, ఆ ఇళ్లను వేరే నియోజకవర్గానికి చెందిన వారికి కేటాయించడంపై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రాంతంలో భూమి ఉందో ఆ స్థానిక పేదలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
* పాడైన ఇళ్లకు పునర్నిర్మాణం..
1999 నుండి 2004 మధ్య కాలంలో నిర్మించిన ‘వాంబే’ (VAMBAY), JNNURM ఇళ్లు ప్రస్తుతం అత్యంత శిథిలావస్థకు చేరాయని వివరించారు. వర్షాకాలంలో ఇవి ప్రమాదకరంగా మారాయని, తీవ్రంగా దెబ్బతిన్న భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మించాలని, మరమ్మతులకు గురైన ఇళ్లకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
