Chakali Ilamma 41st Death Anniversary
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణ సాయుధ పోరాట యోధులు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను జనగామ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చాకలి ఐలమ్మ మనవరాలు మరియు మహిళా కమిషన్ మెంబర్ చిట్యాల శ్వేత, ఇతర ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు మహిళా కమిషన్ మెంబర్ చిట్యాల శ్వేత మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన ధీరోదాత్తమైన పోరాటం తెలంగాణ చరిత్రలోనే చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె చూపిన తెగువ, పోరాట పటిమను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగడమే ఐలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు ఐలమ్మ జీవన ప్రయాణం నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) మెంబర్ చిలువేరు అభి గౌడ్, జనగామ మున్సిపల్ చైర్మన్ కదకంచి బలమని, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ కులాల జిల్లా నాయకులు, రజక సంఘం ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
