Gold Finance Fraud
* గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని బురిడీ కొట్టించిన ఇద్దరు అరెస్ట్
ఆకేరు న్యూస్, హనుమకొండ: నకిలీ బంగారం తాకట్టు పత్రాన్ని సృష్టించి, అసలు బంగారం తాకట్టు లేకపోయినా ఉన్నట్లు నమ్మించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్, సీఈఓ, వడ్డేపల్లి రంజిత్ (39), వ్యాపారి ఉన్నారు.
* నకిలీ ప్లెడ్జ్ రసీదు
పోలీసుల విచారణలో సంతోష్, రంజిత్ కలిసి కుట్ర పన్నినట్లు వెల్లడైంది. రంజిత్‌కు చెందిన సుమారు 640 గ్రాముల బంగారం శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్‌లో తాకట్టు ఉన్నట్లు చూపిస్తూ నకిలీ ప్లెడ్జ్ రసీదును తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.
* 59.30 లక్షల బదిలీ
నకిలీ పత్రాన్ని నిజమైనదిగా నమ్మించిన నిందితులు.. బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బులు పొందినట్లు పోలీసులు వెల్లడించారు. కంపెనీ ప్రతినిధి తన బ్యాంకు ఖాతా నుంచి RTGS ద్వారా రూ.59,30,000లను శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ ఖాతాకు బదిలీ చేసినట్లు తెలిపారు. మోసం విషయం గుర్తించిన గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో.. ఖాతాలోని నగదును ఇతర అవసరాలకు మళ్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
* మొబైల్ ఫోన్లు, ప్లెడ్జ్ కాపీ స్వాధీనం
కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల మొబైల్ ఫోన్లు, నకిలీ ప్లెడ్జ్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
* పోలీసుల హెచ్చరిక
నకిలీ తాకట్టు పత్రాలను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని పోలీసులు సూచించారు. గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు, ప్రజలు తాకట్టు పెట్టిన బంగారం వాస్తవంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని హనుమకొండ ఇన్స్పెక్టర్ సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
