Dr. A. Appayya, Private Hospitals Rules
* ఉల్లంఘిస్తే చర్యలు డీఎంహెచ్ఓ
ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య సూచించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మానవీయ కోణంలో వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.
డాక్టర్ నిఖిల్, జిల్లా మేనేజర్ విక్రమ్, మున్సిపల్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి శనివారం హనుమకొండలోని రోహిణి హాస్పిటల్, ఏకశిలా హాస్పిటళ్లను డీఎంహెచ్ఓ సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పెషలిస్ట్ వైద్యుల వివరాలు, వైద్య సేవల ఫీజుల పట్టిక, ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.
అలాగే ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ తదితర పథకాల కింద అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, నిబంధనల ప్రకారం సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయానికి సమర్పించాల్సిన నివేదికలను సకాలంలో అందించాలని ఆదేశించారు.
తనిఖీల్లో భాగంగా వైద్య సేవల ఫీజుల పట్టికను రోగులు, వారి సహాయకులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఇతర లోపాలపైనా రెండు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కన్సల్టేషన్ ఫీజులు, వైద్య సేవల ధరలు, సేవలు అందించే వైద్యుల వివరాలను ఆసుపత్రులు, క్లినిక్లలో స్పష్టంగా ప్రదర్శించాలని డాక్టర్ అప్పయ్య సూచించారు. రోగులు, వారి సహాయకులు కూడా ఆసుపత్రుల్లో ఈ వివరాలను పరిశీలించాలని కోరారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
