R Krishnaiah
- ఆర్. కృష్ణయ్య డిమాండ్
R Krishnaiah: ఆకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు.
మంగళవారం ఇందిరాపార్కు వద్ద నాన్-పొలిటికల్ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆర్. కృష్ణయ్య హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాలకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు.
రూ.25 లక్షల సాయం ఇవ్వాలి
ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థల దోపిడీని అరికట్టి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ఆర్. కృష్ణయ్య కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఆటోలకు రాష్ట్ర పర్మిట్ ఇవ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లలో 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆటో కార్మికులపై విధించిన అన్యాయమైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేసి, సామాజిక భద్రత చట్టాన్ని తీసుకురావాలని అన్నారు.
ఆటో జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్, ప్రధాన కార్యదర్శి బుగడాల సాయిలు మాట్లాడుతూ.. ఆటో ఇన్సూరెన్స్‌ను రూ.1,000కి పరిమితం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా ఆటోలకు స్టేట్ పర్మిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ఈ ధర్నాలో జాజుల శ్రీనివాస్‌గౌడ్, నల్లాల కనకరాజు, ఎస్కె దస్తగిరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లిపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
