Sabitha Indra Reddy
* సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy: ఆకేరు న్యూస్, మహేశ్వరం: తాను మహేశ్వరం నియోజకవర్గాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని తెలిపారు. చేవెళ్లకు వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
మంగళవారం బడంగ్పేట్ సర్కిల్ మీర్పేట్ డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ గిరిజన నేతలతో నిర్వహించిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. తాను మహేశ్వరంలోనే కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతోనే కొందరు ప్రతిపక్ష నేతలు నిరాధారమైన ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలు, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు.
వ్యక్తిగత విమర్శలు తగవు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తనపై కొందరు ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేశారని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. తనను నాన్-లోకల్‌గా ప్రచారం చేయడంతో పాటు, తాను తిరిగి చేవెళ్లకు వెళ్లిపోతానంటూ పలువురు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు, దుష్ప్రచారాలు చేసినా తాను మహేశ్వరం ప్రజల వెంటే ఉంటానని స్పష్టం చేశారు.
అభివృద్ధికి కట్టుబడి ఉంటా
తనపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రత్యర్థులు తమలో తాము ధైర్యం నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలు తన వెంటే ఉన్నారని, మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని భరోసా ఇచ్చారు. గిరిజన నేతలు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో స్థానిక నాయకులు, పలువురు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
