Kadiyam Srihari
Kadiyam Srihari: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిల్పూర్ మండలానికి చెందిన 32 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.32,03,712, 27 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.9,73,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు.
సంక్షేమ పథకాల అమలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ పేద, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, సన్నధాన్యానికి రూ.500 బోనస్, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
ప్రతి ఎకరాకు సాగునీరు
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
చిల్పూర్ మండల కేంద్రంలో త్వరలోనే మండల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మల్లన్నగండి రిజర్వాయర్ ద్వారా చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
