Telangana AICC In-Charge
* తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జ్గా ఎ.చెల్లకుమార్
* లండన్‌కు మీనాక్షి..
* 10 నెలలు క్రియాశీల రాజకీయాలకు దూరం
ఆకేరు న్యూస్, డెస్క్ : భవిష్యత్ రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తమ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టి సారించింది.
ఇందులో భాగంగా తెలంగాణతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లను నియమించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అదేవిధంగా ఐదారు రాష్ట్రాలకు కొత్త పీసీసీ (PCC) అధ్యక్షులను మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
*మీనాక్షి నటరాజన్ స్థానంలో ఎ.చెల్లకుమార్
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ స్థానంలో తమిళనాడుకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎ.చెల్లకుమార్ పేరును అధిష్ఠానం బలంగా పరిశీలిస్తోంది. గతంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం చెల్లకుమార్‌కు ఉండటంతో, ఆయన వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
*లండన్ ప్రయాణం.. 10 నెలలు దూరంగా
ఇప్పటివరకు రాహుల్ గాంధీ కోర్ టీమ్‌లో కీలక సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్, ఈ నెల 18వ తేదీ నుంచి ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లనున్నారు. సుమారు 10 నెలల పాటు ఆమె కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, క్షేత్రస్థాయి సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకే తక్షణమే కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించాలని అధిష్ఠానం భావిస్తోంది. హైకమాండ్ ఆమోదం లభించిన వెంటనే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల కొత్త ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
