Collector Chahat Bajpai
* పాఠశాలల నుంచి అంగన్వాడీ వరకు..
* కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆకస్మిక తనిఖీలు
ఆకేరు న్యూస్, హన్మకొండ : జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, విద్య, పారిశుద్ధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నడికూడ మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, భవిత కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అధికారుల పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.
నడికూడ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డు రూమ్ నిర్వహణ తీరును పరిశీలించారు. భూ సంబంధిత రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, అవసరమైన రికార్డులను భద్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
*విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఆరా..
కంటాత్మకూర్లోని హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పదో తరగతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల చదువు, సబ్జెక్టులపై అవగాహన, పాఠశాలలో అందుతున్న విద్యాబోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం కంటాత్మకూర్ మండల ప్రాథమిక పాఠశాలలోని భవిత కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో ఉన్న పిల్లల విద్యా సామర్థ్యాలను పరిశీలించడంతో పాటు వారికి అందుతున్న బోధన, శిక్షణ విధానాన్ని తెలుసుకున్నారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న వివిధ మౌలిక సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు.
* అంగన్వాడీ కేంద్రంలో SIR ప్రక్రియపై ఆరా..
నడికూడ మండలం రామకృష్ణాపూర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో పిల్లలకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఏ విధంగా కొనసాగిందనే విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. SIR ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించారు.
* గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యక్ష పరిశీలన..
కలెక్టర్ గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పర్యటన స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
