Ganesh Immersion
Anantapur: ఆకేరు న్యూస్, డెస్క్: అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు వినాయక నిమజ్జనంపైనా ప్రభావం చూపాయి. కాలువలు, చెరువులు, వాగులు ఎండిపోవడంతో పలుచోట్ల నిమజ్జనం కోసం తీసుకెళ్లిన గణేశ్ విగ్రహాలను నీళ్లు లేని ప్రాంతాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బుక్కరాయసముద్రం మండలంలోని వెంకటాపురం, దయ్యాలకుంటపల్లి గ్రామాల ప్రజలు వినాయక విగ్రహాలను హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ వద్దకు తీసుకెళ్లారు. అయితే కాలువలో నీరు లేకపోవడంతో నిమజ్జనం చేయలేక విగ్రహాలను అక్కడే ఉంచారు.
ఎల్లనూరు మండలంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. చిత్రావతి పరివాహక ప్రాంతంలోని ఎండిపోయిన చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లిన విగ్రహాలను నీరు లేకపోవడంతో ఎండిన నేలపైనే ఉంచారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానిక నివేదికలు వెల్లడించాయి.
* 51.5 శాతం వర్షపాతం లోటు
ప్రభుత్వ వర్షపాత గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకు అనంతపురము జిల్లాలో 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 261.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 51.5 శాతం లోటు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ 63.9 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ కరువు ప్రభావం వ్యవసాయంపైనా పడింది. సెప్టెంబర్ 12 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,44,443 హెక్టార్లలో పంటలు తేమ ఒత్తిడికి గురికాగా.. అనంతపురంలో 32,456 హెక్టార్లు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు.
* నిమజ్జన ఏర్పాట్లకూ నీటి కొరత
వినాయక నిమజ్జనం కోసం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ క్రేన్లు, బారికేడ్లు, తాగునీటి వంటి ఏర్పాట్లు చేపట్టింది. అయితే నిమజ్జనానికి అవసరమైన నీటి లభ్యతే ప్రధాన సమస్యగా మారింది. సాధారణంగా నీటి వనరుల్లో నిర్వహించే నిమజ్జనం ఈసారి ఎండిపోయిన కాలువలు, చెరువు కట్టల వద్దకు పరిమితమైంది.
నిమజ్జనం కోసం తీసుకొచ్చిన గణేశ్ విగ్రహాలు నీళ్లు లేని ప్రదేశాల్లో కనిపించడం.. అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువు తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
