Rajendranagar crime news
* హైదరాబాద్‌లో దారుణం
* డ్రగ్స్ గుట్టు రట్టు చేస్తున్నాడని హత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హత్య తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ సమాచారం లీకేజీ అనుమానాలపై స్నేహితుల మధ్య చెలరేగిన అనుమానాలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న వసీం అనే యువకుడు, అతని స్నేహితులు కొంతకాలంగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వసీంతో పాటు అతన్ని హత్య చేసిన నిందితులపై గతంలోనూ మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించిన NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదై ఉన్నాయి. వీరంతా కలిసి స్థానికంగా డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
* హత్యకు కారణం ఇదే
డ్రగ్స్ దందాకు సంబంధించిన ప్రతి కదలిక, కీలక సమాచారం పోలీసులకు ఎప్పటికప్పుడు లీక్ అవుతుండటంతో గ్యాంగ్‌లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సమాచారమంతా గ్రూప్‌లోని వసీమే పోలీసులకు చేరవేస్తున్నాడని అతని స్నేహితులకు అనుమానం కలిగింది. దీంతో వసీంను అంతం చేయాలని వారు ప్లాన్ వేసుకున్నారు. దీనిపై నిందితులకు, వసీంకు మధ్య ఉప్పర్‌పల్లి ప్రాంతంలో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఇద్దరు ప్రధాన నిందితులు క్షణికావేశంలో తమ వెంట తెచ్చుకున్న కత్తులతో వసీంపై విచక్షణారహితంగా దాడి చేశారు. గొంతు, ఛాతీ భాగాలపై బలమైన కత్తిపోట్లు పడటంతో వసీం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
* నిందితుల కోసం వేట
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న వసీం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డ్రగ్స్ నెట్వర్క్ కోణంలోనూ, ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలోనూ పోలీసులు సమగ్ర దర్యాప్తు ముమ్మరం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
