Suresh Babu
* గౌలిదొడ్డి పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన సురేష్ బాబు!
* 840 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులు
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు, అద్భుతమైన అభ్యాస వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప మహత్కార్యానికి రంగం సిద్ధమైంది. గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చివేసేలా భారీ నిధుల సమీకరణకు ప్రముఖ చలనచిత్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు నడుం బిగించారు. ఈమేరకు ఫుడ్ ఫర్ చేంజ్ పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
సన్నాహక సమావేశంలో కీలక నిర్ణయం
హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఫుడ్ ఫర్ చేంజ్’ గాలా చారిటీ డిన్నర్ తొమ్మిదవ ఎడిషన్‌కు సంబంధించిన సన్నాహక సమావేశం గురువారం అమీర్‌పేటలోని మారీగోల్డ్ హోటల్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 840 మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని తెలిపారు. ఈ పాఠశాల క్యాంపస్‌ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడానికి మొత్తం రూ.7.75 కోట్ల వ్యయం అవుతుందని ఆయన వెల్లడించారు.
ప్రముఖుల చేయూత
ఈ సత్కార్యానికి కేవలం ఒక్కరిద్దరే కాకుండా సమాజంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు పెద్దఎత్తున మద్దతుగా నిలుస్తుండటం విశేషం. ఈ కార్యక్రమంలో సురేష్ బాబుతో పాటు సునీల్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ సునీల్ చంద్రరెడ్డి, సరాకా ల్యాబ్స్ డైరక్టర్ సునీల్ లింగా రెడ్డి, హెచ్ఆర్టీ8 డైరక్టర్ జాయ్దీప్ పొనుగోటి, ప్రాజెక్ట్ 511 గవర్నంగ్ కౌన్సిల్ చైర్మన్ హుస్సేన్ చాస్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కలిసి విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు తమవంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.
అక్టోబర్ 3న గాలా డిన్నర్
ఈ నిధుల సేకరణలో భాగంగా 2026 అక్టోబర్ 3వ తేదీన జేఆర్సీ కన్వెన్షన్స్ వేదికగా ఫుడ్ ఫర్ చేంజ్ గాలా డిన్నర్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, సినీ సెలబ్రిటీలు, హై నెట్‌వర్త్ వ్యక్తులు, సామాజిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. రుచికరమైన భోజనం, అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక మంచి ఉద్దేశంతో సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, భావి భారత పౌరుల చదువులకు చేయూతనివ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
