Kalki 2898 AD
* అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్..
* 2027 మిడ్‌కి ప్రొడక్షన్ పూర్తి
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎక్స్ట్రావెంజా సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రెండో భాగానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న కల్కి సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ మరోసారి ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో కొనసాగనున్నారు.
తొలి భాగం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకోవడంతో పాటు రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి కథ, ప్రపంచం, విజువల్స్‌ను మరింత భారీ స్థాయిలో చూపించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని సమాచారం. భారీ షెడ్యూల్‌తో షూటింగ్‌ను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటీనటులు వచ్చే నెల నుంచి షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 2027 మధ్య నాటికి మొత్తం ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. తొలి భాగాన్ని మించిన గ్రాండ్ స్కేల్లో ఈ సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
