Chakali Ilamma Jayanthi
* పాలకుర్తి, తొర్రూర్లో ఘనంగా జయంతి
ఆకేరు న్యూస్, పాలకుర్తి/తొర్రూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్లో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు.
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు పోగు శ్రీనివాస్ ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఐలమ్మ పోరాట వారసత్వాన్ని నేటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొనసాగించడమే ఆమెకు నిజమైన నివాళి అని అన్నారు.
అదే విధంగా పాలకుర్తిలో సీపీఎం–సీఐటీయూ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య మాట్లాడుతూ పేద రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. భూమి, ఉపాధి, విద్య, వైద్యం, కనీస వేతనాలు, కార్మిక హక్కులు, మహిళలపై హింస, సామాజిక అసమానతలు వంటి సమస్యలపై ప్రజలు పోరాడాలని అన్నారు.
తొర్రూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మోతుకూరి రవీంద్రాచారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు.. నైజాం సర్కార్, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని కొనియాడారు. మహిళలకు ఐలమ్మ పోరాట పటిమ, ధైర్యం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్, సీపీఎం, సీఐటీయూ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
