ECI
ECI| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి సమక్షంలో శనివారం పూర్తి కమిషన్ సమావేశం నిర్వహించింది.
ఇంటివద్దకే BLOలు
SIR ప్రక్రియలో లాజికల్ లోపాలు, మ్యాపింగ్ సమస్యల కారణంగా నోటీసులు అందుకున్న వారు ERO లేదా AERO కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ECI తెలిపింది. సంబంధిత బూత్ లెవెల్ అధికారులు (BLOలు) వారి ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి ECINetలో అప్లోడ్ చేస్తారని వెల్లడించింది.
ఆన్లైన్లో విచారణ
అవసరమైన ప్రత్యేక సందర్భాల్లో విచారణను ఆన్లైన్లో నిర్వహించే అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు తరఫున కుటుంబంలోని వయోజన సభ్యుడు విచారణకు హాజరయ్యేందుకు కూడా అనుమతి ఉంటుంది.
పేరు లేకపోతే దరఖాస్తు
SIR ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాబితాలో పేరు లేని వారు నిరంతర సవరణ ప్రక్రియ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ECI తెలిపింది. యువ ఓటర్లు, తొలిసారి ఓటు హక్కు పొందేవారికి కూడా ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
పేదలు, నిరాశ్రయులకు ప్రత్యేక శిబిరాలు
నైట్ షెల్టర్లు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగిన హెల్ప్‌డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఇటీవల ఎన్నికల కమిషన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
