Priyadarshi Shankaranna
*‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర స్పందన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నటుడు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ పాత్ర రూపురేఖలు, తెలంగాణ యాస, హావభావాలు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలి ఉండటంతో సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రియదర్శి నటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు తెలియజేశారు.
*‘ప్యారడైజ్’లో కేసీఆర్ పాత్రలో జీవించావు..
ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘ప్యారడైజ్’ సినిమాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి అద్భుతంగా నటించారని హరీశ్ రావు ప్రశంసించారు.
కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును సహజంగా పండించారని కొనియాడారు. తెలంగాణ యాస, పల్లె కథలను సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రియదర్శి ప్రతిభను అభినందించారు.
‘మల్లేశం’, ‘బలగం’ సినిమాల ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలు, పల్లె సంస్కృతి, కుటుంబ బంధాలను చాటిచెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా భవిష్యత్తులో మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాలని ఆకాంక్షించారు.
*‘శంకరన్న’ పాత్రకు ప్రత్యేక గుర్తింపు..
‘ది ప్యారడైజ్’ సినిమాలో (ప్రియదర్శి) శంకరన్న అనే ఎమ్మెల్యే పాత్రలో కనిపించారు. సినిమాలో పాత్ర పేరు కేసీఆర్‌ది కాకపోయినప్పటికీ.. గెటప్, బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాస, డైలాగ్ డెలివరీ తదితర అంశాలు కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉన్నాయి.
కథలో శంకరన్న పాత్ర సవారీ తెగ ప్రజల సమస్యలు, వారి గుర్తింపు కోసం జరిగే పోరాటానికి సంబంధించిన అంశాల్లో కనిపిస్తుంది. ఆయుధాలకు బదులుగా రాజకీయ మార్గంలో సమస్యలను పరిష్కరించాలనే ధోరణితో పాత్రను చూపించినట్లు కథనాలు వివరించాయి. దీంతో ఈ పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
*తెరపై కేసీఆర్‌ను పోలిన లుక్..
ప్రియదర్శి కనిపించే విధానం, ఆయన మాట్లాడే తీరు, తెలంగాణ యాస, హావభావాలు కేసీఆర్‌ను పోలి ఉండటంతో సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమా విడుదల అనంతరం శంకరన్న పాత్రకు సంబంధించిన సన్నివేశాలు, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కేసీఆర్ పాత్రను పోలి కనిపించేందుకు ప్రియదర్శి గెటప్, మేకప్, బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేకంగా పనిచేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ పాత్ర కోసం ప్రియదర్శిని ఎంపిక చేసే ముందు పలువురిని పరిశీలించినట్లు, చివరకు ప్రియదర్శి రూపం ఈ పాత్రకు సరిపోతుందని భావించినట్లు తెలిపారు.
*పాత్ర చేయడానికి తొలుత భయపడ్డ ప్రియదర్శి..
శంకరన్న పాత్ర గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పినప్పుడు మొదట తనకు భయమేసిందని ప్రియదర్శి ఇటీవల వెల్లడించారు. కేసీఆర్‌ను పోలిన పాత్ర కావడంతో ఆ పాత్రను ఎలా పోషించాలన్న విషయంలో తాను జాగ్రత్తగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు.
పాత్రకు అవసరమైన తెలంగాణ యాస, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా సిద్ధమయ్యానని ప్రియదర్శి చెప్పారు. పాత్రను స్వీకరించిన తర్వాత దాన్ని ఒక సవాల్‌గా తీసుకుని నటించినట్లు ఆయన వివరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
