SIR 2026
SIR 2026| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ మనూ చౌదరితో కలిసి ఆయన ఆకస్మికంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.
కైతలాపూర్ వార్డు ప్రగతినగర్‌లో బీఎల్వోలు దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న తీరును సీఈఓ పరిశీలించారు. ఓటర్ల నుంచి ఎస్ఎస్సీ మెమోలు, పాస్‌పోర్టులు వంటి పత్రాలు అందుతున్నట్లు సిబ్బంది వివరించారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు సేకరించడం బీఎల్వోల బాధ్యత కాగా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదించాల్సిన బాధ్యత సూపర్వైజర్లదేనని ఆయన స్పష్టం చేశారు.
పెండింగ్‌పై ఆగ్రహం
నియోజకవర్గంలో లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై సీఈఓ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈఆర్వో, ఏఈఆర్వోలతో ఓటర్ల జాబితా, తొలగించిన ఓట్లు, నోటీసులు, అప్లోడ్ వివరాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
హియరింగ్, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు, సమర్థంగా పనిచేస్తున్న ఏఈఆర్వోలను అభినందించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం పకడ్బందీగా, పారదర్శకంగా జరిగేలా ఈఆర్వోలు, ఏఈఆర్వోలు నిరంతరం పర్యవేక్షించాలని సీఈఓ సూచించారు. ఈ పర్యటనలో జడ్సీ మయాంక్ సింగ్, కూకట్పల్లి సర్కిల్ డీసీ ఆంజనేయులు, తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
