NTR
NTR| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఫహాద్ ఫాజిల్ హీరోగా శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఫాహద్పై ఎన్టీఆర్ ప్రశంసలు
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. గాయం నుంచి తాను కోలుకున్నానని, ‘డ్రాగన్’ చెప్పిన సమయానికే విడుదల అవుతుందని తెలిపారు. ఫాహద్ ఫాజిల్ తనకు అత్యంత ఇష్టమైన నటుల్లో ఒకరని చెప్పారు. దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్ అని ప్రశంసించారు. తెలుగులో తొలిసారి లీడ్ యాక్టర్‌గా నటిస్తున్న ఆయనకు మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు.
దర్శకుడిగా శశాంక్ ఏలేటికి ఇది తొలి సినిమా అని, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఆయనకు గొప్ప విజయాన్ని అందించాలని కోరుకున్నారు. నిర్మాతగా ఎస్.ఎస్. కార్తికేయ మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి రాజమౌళి చిత్రాల వెనుక కార్తికేయ కీలకంగా పనిచేశారని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
గొప్ప సినిమా: రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ.. ఫాహద్ ఫాజిల్ ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారని ప్రశంసించారు. శశాంక్ మూడేళ్ల క్రితం ఈ కథ చెప్పారని, ‘ఒక దయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ’ అంటూ ప్రారంభించి మూడు గంటల కథ చెప్పారని గుర్తుచేశారు. కథ విన్న వెంటనే తాను ఓకే చెప్పానన్నారు.
సినిమా చూసి తాను ఏడ్చానని, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 2న ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
కీరవాణి ఆకాంక్ష
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. దర్శకుడు శశాంక్ తన గురువు చంద్రశేఖర్ ఏలేటిని మించి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. తన కుమారుడు కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు మంచి పేరు రావాలని, ఫాహద్ ఫాజిల్‌కు మంచి హిట్ దక్కాలని కోరుకున్నారు. నిర్మాతగా కార్తికేయ తొలిసారి సినిమా నిర్మాణంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హీరో ఫాహద్ ఫాజిల్, బాలనటి సారా, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ, దర్శకుడు శశాంక్ ఏలేటి, సంగీత దర్శకుడు కాలభైరవ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
