Cyber Crime
Cyber Crime| ఆకేరు న్యూస్, హైదరాబాద్: క్రెడిట్ కార్డు లిమిట్‌ను భారీగా పెంచుతామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.3.18 లక్షలు కాజేశారు. నకిలీ ఏపీకే (APK) ఫైల్‌ను పంపి ఫోన్లోకి ప్రవేశించి, క్రెడిట్ కార్డు వివరాలతో పాటు ఓటీపీలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఆర్బీఎల్ కస్టమర్ కేర్ పేరుతో కాల్
నిజాంపేటకు చెందిన బాధితుడికి సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 1:44 గంటలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఆర్బీఎల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి, క్రెడిట్ కార్డు లిమిట్‌ను రూ.7.30 లక్షలకు పెంచుతామని నమ్మించాడు. అనంతరం వాట్సాప్‌లో ‘RBL Card Limit Increase.apk’ పేరుతో ఓ ఫైల్ పంపాడు.
ఏపీకే ఫైల్‌తో ట్రాప్
ఫైల్‌ను ఓపెన్ చేసిన తర్వాత కొన్ని యాప్ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేయాలని నిందితుడు సూచించాడు. అనంతరం ఫోన్లో ఆర్బీఎల్ పేరుతో కనిపించిన అప్లికేషన్లో పేరు, పుట్టిన తేదీ, క్రెడిట్ కార్డు నంబర్, ఎక్స్పైరీ తేదీ, సీవీవీ వంటి వివరాలను నమోదు చేయించాడు. అదే సమయంలో బాధితుడి ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను మరో నంబర్‌కు ఫార్వర్డ్ అయ్యేలా సెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నాలుగు లావాదేవీల్లో నగదు మాయం
కొద్దిసేపటికే బాధితుడి ఫోన్‌కు వరుసగా ఓటీపీలు రావడంతో పాటు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు సందేశాలు వచ్చాయి. నాలుగు లావాదేవీల్లో రూ.1,41,906, రూ.1,41,903, రూ.29,005, రూ.5,800 చొప్పున మొత్తం రూ.3,18,614 కాజేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ నంబర్, బ్యాంకు లావాదేవీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
