Sangareddy Crime News Elderly Couple Suicide
* పట్టెడన్నం లేక బావిలో దూకిన వృద్ధ దంపతులు
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : కన్నబిడ్డల ఆదరణ కరువైందన్న ఆవేదనతో ఓ వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తమకు ఉన్న భూమి, ఇంటిని ముగ్గురు కుమారులకు పంచిచ్చిన తర్వాత వారు పట్టించుకోలేదని, ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చివరకు వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావిలో దూకి దంపతులు ప్రాణాలు తీసుకున్నారు.
*బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తా(కె) గ్రామ శివారులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సారెడ్డి (75), ఆయన భార్య అంజమ్మ (70) వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
*ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకం..
గ్రామస్తుల సమాచారం ప్రకారం.. నర్సారెడ్డి, అంజమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తమ జీవితకాలంలో సంపాదించిన సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటిని కూడా ముగ్గురు కుమారులకు పంచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆస్తి పంపకం అనంతరం కుమారులు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కుమారులు వారిని పట్టించుకోకపోవడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కుమారులు తమతో మాట్లాడటం లేదని, తమ పరిస్థితిని పట్టించుకోవడం లేదని గతంలో నర్సారెడ్డి, అంజమ్మ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
*ఆరోగ్యం సహకరించక.. ఇబ్బందులు
అంజమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో స్వయంగా వంట చేసుకునే పరిస్థితి కూడా లేకపోయిందని పేర్కొన్నారు. దీంతో సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తీసుకుని జీవనం సాగించిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
వృద్ధాప్యంలో తమను చూసుకునే వారు లేకపోవడంతో దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. కనీసం తమ బతుకుదెరువు కోసం కుమారులకు పంచిన భూమిలో నుంచి ఒకటి, రెండు ఎకరాల భూమిని తిరిగి ఇప్పించాలని వారు గతంలో పోలీసులను, అధికారులను కోరినట్లు తెలిపారు.
* అధికారులను ఆశ్రయించినా ఫలితం శూన్యం..
తమ జీవనం కోసం కొంత భూమిని తిరిగి ఇప్పించాలని వృద్ధ దంపతులు పలుమార్లు అధికారులను, పోలీసులను వేడుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే తమ సమస్యకు పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
కుమారుల నుంచి ఆదరణ లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, జీవనాధారానికి ఇబ్బందులు వంటి కారణాలతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.
*మనవడి ఫిర్యాదుతో కేసు నమోదు..
ఈ ఘటనపై మృతుల మనవడు తిరుపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులను పోలీసులు విచారిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
