Parakala
Parakala| ఆకేరు న్యూస్, పరకాల: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఆకులవాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి, కూతురిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా కూతురు మృతి చెందగా, తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఆకులవాడకు చెందిన సుగుణమ్మ (60), ఆమె తల్లి లక్ష్మమ్మ (85) ఇంట్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సుగుణమ్మ మృతిచెందగా.. లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన లక్ష్మమ్మను చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
బంగారం కోసమేనా?
ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలపై దాడి వెనుక దోపిడీ కోణం ఉందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం అపహరించేందుకే దాడి జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు.
ఆలస్యంగా వెలుగులోకి
ఇంట్లో తల్లి, కూతురు మాత్రమే నివసిస్తుండటంతో ఘటన వెంటనే బయటకు రాలేదని తెలుస్తోంది. దాడి గత రాత్రి జరిగిందా.. లేక గురువారం మధ్యాహ్నం జరిగిందా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన సమయానికి తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, ఘటనకు అసలు కారణం ఏమిటనే కోణాల్లో పరకాల పోలీసులు విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
