Madanapalle CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan
* హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం
ఆకేరు న్యూస్, మదనపల్లె : మదనపల్లెలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు వారు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరుకానున్నారు.
రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఉద్యాన పంటల సాగు, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ తదితర రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున రూ.40,352 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా.. ప్రైవేట్ రంగం నుంచి మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమలో ఉద్యాన రంగానికి కొత్త ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం లభించేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
