Droupadi Murmu
*అక్టోబర్ 14, 15న ద్రౌపదీ ముర్ము పర్యటన
ఆకేరు న్యూస్, విజయవాడ : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’కు ఘనత మరింత పెరగనుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అక్టోబర్ 14, 15 తేదీల్లో విజయవాడలో పర్యటించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. నగర సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికత, పర్యాటక ప్రాధాన్యాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా ఉత్సవాలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
ఇక విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. 5కే, 10కే రన్లలో పాల్గొనేందుకు 22 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘క్లీన్ సొసైటీ.. గ్రీన్ సొసైటీ’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
]విజయవాడకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్, స్వచ్ఛ మారథాన్లకు ఇతర రాష్ట్రాల నుంచి స్పందన రావడం నగరానికి దక్కిన ప్రత్యేక గుర్తింపుగా అభివర్ణించారు.
‘విజయవాడలో ఏ కార్యక్రమం నిర్వహించినా సూపర్‌హిట్ కావడం నగరవాసుల ప్రత్యేకత’ అని చిన్ని వ్యాఖ్యానించారు. ప్రజలు, యువత, నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే విజయవాడ ఉత్సవ్‌ను దేశవ్యాప్తంగా గుర్తుండిపోయేలా నిర్వహించవచ్చని తెలిపారు.
ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్ అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్నారు. పున్నమి ఘాట్ ప్రధాన వేదికగా ఉండగా, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ కాలేజీ ప్రాంగణాల్లోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్ మేళా వంటి కార్యక్రమాలతో విజయవాడలో పండుగ వాతావరణం నెలకొననుంది. కళలు, సంస్కృతి, వినోదం, పర్యాటకాన్ని కలగలిపి నగరాన్ని ప్రత్యేక సాంస్కృతిక గమ్యస్థానంగా తీర్చిదిద్దేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
