Diwali crackers
పూర్తి నిషేధం ఉండదు
అకేరు న్యూస్, న్యూఢిల్లీ : దీపావళి సందర్భంగా టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసులపై పూర్తిస్థాయి నిషేధం విధించబోమని, అదే సమయంలో రోజంతా టపాసులు కాల్చేందుకు కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. కాలుష్య ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమతుల్య విధానం అవలంబించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
టపాసుల వినియోగానికి నిర్దిష్ట సమయాలను నిర్ణయించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. ఏ రకమైన టపాసులను అనుమతించాలన్న అంశాన్ని కూడా సంబంధిత నివేదికలను పరిశీలించిన తర్వాత నిర్ణయించనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా, కొత్త తరం జాయింట్ గ్రీన్ క్రాకర్స్ (లాడీలు) తయారీ, విక్రయానికి కొన్ని నిబంధనలతో అనుమతి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను కోర్టు పరిశీలించింది. బేరియం ఆధారిత టపాసులపై పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నివేదికను అక్టోబర్ 15లోగా సమర్పించేందుకు కోర్టు సమయం ఇచ్చింది.
అయితే, టపాసులు కాల్చేందుకు తుది సమయాలు ఏమిటన్నది ఇంకా ఖరారు కాలేదు. ఢిల్లీ-ఎన్సీఆర్కు సంబంధించిన కొన్ని అంశాలు మరో పెండింగ్ కేసుతో ముడిపడి ఉండటంతో వాటిపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
