TGPSC candidates demand rescheduling
* ఒకే రోజు రెండు కీలక పరీక్షలు..
* తేదీ మార్చాలని విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, డెస్క్: రాష్ట్రంలో వివిధ రకాల పోటీ పరీక్షల తేదీల కేటాయింపులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అనుసరిస్తున్న విధానంపై అభ్యర్థులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి సమన్వయం లేకుండా ఒకే రోజు కీలక పరీక్షలను ఖరారు చేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లోని అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులకు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మేనేజర్ (ఇంజినీరింగ్ – సివిల్) పోస్టులకు ఒకే రోజు పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు రావడమే ఈ వివాదానికి కారణమైంది.
ఈ నెల 26న రెండు పరీక్షలూ ఒకే రోజు తారసపడటంతో, ఏళ్లకు ఏళ్లుగా శ్రమించి సిద్ధమవుతున్న అభ్యర్థులు రెండింటిలో ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరయ్యే దుస్థితి ఏర్పడింది.
* ఏఈఈ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి
రెండు ప్రభుత్వ సంస్థల పరీక్షలు ఒకే రోజు రావడం వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏఏఐ పరీక్ష తేదీల్లో మార్పులు సాధ్యం కావు కాబట్టి, టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని ప్రతిభా భవన్లో టీజీపీఎస్సీ కార్యదర్శిని సోమవారం అభ్యర్థుల బృందం కలసి వినతిపత్రం సమర్పించింది. ఆందోళనలో ఉన్న నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 26న జరగాల్సిన టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను తక్షణమే మరో తేదీకి మార్చాలని వారు కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
