CM Revanth Reddy Vs Mahesh Goud
* కాంగ్రెస్‌లో పవర్ వార్
* 2034 వరకు నేనే సీఎం: రేవంత్ ధీమా
* బీసీ సీఎం ఖాయం: మహేశ్ చెక్‌మేట్
* ఏకవ్యక్తి ఆధిపత్యానికి ఢిల్లీ పెద్దల కౌంటర్ ప్లాన్..?
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పవర్ వార్ జరుగుతోందా? రాష్ట్ర ప్రభుత్వంలో అగ్రకులాల ప్రాధాన్యం పెరుగుతోందన్న అసంతృప్తి ఇతర వర్గాల్లో రాజుకుంటోందా? ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి, మరోవైపు పీసీసీ సారథి మహేశ్‌కుమార్ గౌడ్ కేంద్రంగా ఈ ఆధిపత్య పోరు కొనసాగుతోందా? ఇటీవలి పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని సూచిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ పోరుకు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలే పరోక్షంగా ఆజ్యం పోస్తున్నారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ చర్చకు కారణాలు కనిపిస్తున్నాయి.
* 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని
మే నెలలో జరిగిన ఓ మీడియా కాంక్లేవ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని విస్పష్టంగా ప్రకటించారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, పార్టీ సూచించిన వారికి రాష్ట్ర బాధ్యతలను అప్పగించి, తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే కాంగ్రెస్‌లో విస్తృత చర్చ జరిగిందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ సారథిగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆత్మవిశ్వాసం కలిగించడమే లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరు భావించారు. అయితే, ఒక జాతీయ పార్టీలో రాష్ట్ర నాయకుడు.. జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకున్నట్లుగా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడం సరికాదన్న విమర్శలూ వచ్చాయని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ స్థాయిలోనూ చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
సాధారణంగా రెండు అధికార కేంద్రాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. పార్టీ శ్రేణులను నడిపించే నాయకుడితో పోలిస్తే, ప్రభుత్వ సారథిగా ఉన్న ముఖ్యమంత్రికే ఈ పోరులో పైచేయి ఉంటుంది. అయితే, పార్టీ సారథికి ప్రాధాన్యం లేకపోవడం కూడా వర్గవైషమ్యాలను పెంచుతుందన్నది కాంగ్రెస్ పెద్దల అనుభవసారం.
ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతోందన్నది పార్టీలోని మరికొందరి వాదన. ఈ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే.. ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాలు అప్పగించి, చేతులెత్తేసినట్లవుతుందని అంటున్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత సమస్య తీవ్రత మరింత పెరిగిందా అన్న చర్చ జరుగుతోంది.
* కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాతనే..
రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో కొండా సురేఖ దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా పనిచేశారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ప్రకటించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డిని అభ్యర్థిగా సీఎం ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా పరుష పదజాలంతో రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అనంతర పరిణామాల్లో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంత్రి పదవి కోసం ఆశావహులు ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మహేశ్ సొంత జిల్లాకే చెందిన మరో సీనియర్ రెడ్డి నేతవైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రభుత్వంలో రెడ్ల ప్రాధాన్యం పెరిగిందని, జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీల ప్రాతినిధ్యాన్ని మరింత తగ్గించడం మంచిది కాదని బీసీ నేతలు వాదిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మంత్రి పదవి చేపట్టేందుకు తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని మహేశ్ గౌడ్ భావిస్తున్నారు. కాంగ్రెస్ విజయాన్ని ఏ ఒక్కరి ఖాతాలోనూ వేయలేమని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో సబ్బండ వర్గాలు క్రియాశీలక పాత్ర పోషించాయని వాదిస్తున్నారు.
* తమలపాకుతో తానిట్లంటే. తలుపు చెక్కతో నేనొకటి అంటా..!
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో గ్రూపుల మధ్య పోరు యథేచ్ఛగా కొనసాగుతుంటుంది. ఒక విధంగా ఇదే వందేళ్లకు పైగా కాంగ్రెస్‌ను నిలబెడుతోందన్న విశ్లేషణలూ ఉన్నాయి. పార్టీ నాయకులు తమ అస్తిత్వాన్ని, ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతుంటారు. అవి కొన్నిసార్లు నేరుగా, మరికొన్నిసార్లు పరోక్షంగా బయటపడుతుంటాయి.
మహేశ్ గౌడ్–రేవంత్‌రెడ్డి ఆధిపత్య పోరులో ఇప్పుడు పరోక్ష పద్ధతిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా అడ్డుకుంటే.. ఏకంగా సీఎం పీఠాన్నే లక్ష్యంగా చేసుకుంటానన్న స్థాయిలో మహేశ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వేదిక ఏదైనా తమకు అనుకూలంగా మలచుకోవడం రాజకీయ నాయకులకు అనుభవంతో అలవడిన విద్య.
ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగిన ఓబీసీ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వ్యాఖ్యలు.. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించాయి. గతంలో ఎన్నడూ లేనంత గంభీరమైన స్వరంతో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణకు బీసీ వ్యక్తే సీఎం అవుతారని ప్రకటించారు. ఇందుకు పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి మాదిరిగా రేవంత్‌రెడ్డి కూడా బీసీలకు అండగా ఉంటారని చెప్పారు. గతంలో రేవంత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తుచేశారు.
అంతేకాదు.. మనమెంతో మనకు అంత వాటా కావాలని, ఇవ్వకపోతే గుంజుకుంటామని హెచ్చరికలాంటి ప్రకటన చేశారు. బహిరంగంగా ఎవరిని లక్ష్యంగా చేసుకున్నామన్నది అందరికీ అర్థం కాకపోయినా.. సంబంధిత వ్యక్తికి సందేశం చేరితే చాలన్న పద్ధతి రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేనొకటంటా అన్న చందంగా, మహేశ్ స్పందన సుతిమెత్తగా కాకుండా ఘాటుగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
* కీర్తిస్తూనే.. రేవంత్‌పై ఒత్తిడి
మహేశ్ గౌడ్ వ్యూహం రాజకీయ పరిపక్వతతో కూడినట్లు కనిపించింది. శంషాబాద్ ప్రసంగంలో ఆయన రేవంత్‌ను నేరుగా విమర్శించలేదు. బీసీలకు రేవంత్, భట్టి విక్రమార్క మద్దతు ఉంటుందని చెప్పారు. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి మాదిరిగా రేవంత్ కూడా బీసీలకు అండగా నిలిచారని ప్రస్తావించారు. ఇతర వర్గాల సహకారంతో తమ వాటా సాధిస్తామని, అవసరమైతే పోరాడి తీసుకుంటామని స్పష్టం చేశారు.
పైకి ప్రశంసలుగా కనిపించే ఈ వ్యాఖ్యల్లో రాజకీయ ఒత్తిడి కూడా ఉంది. బీసీలకు అండగా నిలిచే నాయకుడిగా రేవంత్‌ను కీర్తిస్తూనే.. వారి అధికార ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని గుర్తుచేశారు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే సామాజిక న్యాయానికి మద్దతు ఇచ్చినట్లవుతుంది. అవకాశాలు పరిమితమైతే.. ప్రకటించిన మద్దతు ఆచరణలో ఎక్కడుందన్న ప్రశ్న ఎదురవుతుంది. నేరుగా వ్యక్తిని విమర్శించకుండానే ఆయన నిర్ణయాలపై ఒత్తిడి పెంచే పద్ధతిగా ఇది పనిచేస్తుంది.
మంత్రివర్గం, శాసనమండలి, కార్పొరేషన్ పదవుల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందని మహేశ్ ప్రకటించడం కూడా ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీ సీఎం నినాదంతో అత్యున్నత లక్ష్యాన్ని ముందుంచుతూనే.. తక్షణ పదవుల పంపిణీపైనా ఆశలు రేకెత్తించారు. ఇప్పటివరకు బీసీలకు దక్కాల్సిన వాటా దక్కలేదన్న స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లయింది.
* నేనెవరి ధైర్యంతో మాట్లాడుతున్నానంటే..?
మహేశ్ గౌడ్ తన బలానికి సంబంధించిన ప్రస్తావననూ ముందుకు తెచ్చారు. తాను ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నానన్న సందేహం పార్టీ శ్రేణుల్లో రావచ్చు. ఆ సందేహాలను నివృత్తి చేసేందుకు తనకు ఢిల్లీ నేతల అండ ఉందని స్పష్టంగా ప్రకటించారు. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే తనకు ఈ ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు.
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘ఇస్ దేశ్ మే జిస్కీ జిత్నీ ఆబాదీ హై.. ఉత్నీ భాగీదారీ’ అన్నారు. బీసీ సీఎం నినాదం తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, కాంగ్రెస్ సంస్థాగత నిర్ణయమని చెప్పుకొచ్చారు. బీసీ కులగణన చేసి ఢిల్లీకి పంపిస్తే బీజేపీ ప్రభుత్వం తొక్కిపట్టిందని కూడా విమర్శించారు.
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో బీసీ కులగణన చేపట్టి, అధికారంలో వాటా అడిగేందుకు అవకాశాలు కల్పించామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోంది. అలాంటప్పుడు తామే బీసీలకు అధికారంలో తగిన అవకాశాలు కల్పించకపోతే.. ప్రజల్లో మరింత పలుచనయ్యే ప్రమాదం ఉందని మహేశ్ గుర్తుచేసినట్లయింది.
* ఏకవ్యక్తి ఆధిపత్యానికి చెక్..
అనేక చేదు అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకవ్యక్తి ఆధిపత్యానికి ఏదో ఒక రూపంలో చెక్ పెడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే పీసీసీ సారథి మహేశ్ గౌడ్‌కు ఢిల్లీ పెద్దల అండ ఉన్నట్లు కనిపిస్తోంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనాకాలంలో ఢిల్లీని శాసించే స్థాయికి ఎదిగారు. ఆ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకునే.. ఢిల్లీ పెద్దలు ఇప్పుడు మహేశ్ గౌడ్‌కు తమవంతు అండదండలు అందిస్తున్నారన్న ప్రచారమూ లేక పోలేదు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.
