Rahul Gandhi Detained
* సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..
* పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ధర్నా
ఆకేరు న్యూస్, డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం వద్ద భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
ఢిల్లీ పోలీసులు ఈసీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి విపక్ష నేతలను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ, నేరుగా బారికేడ్లు ఎక్కి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య సూత్రాల కోసం తమ పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.
* పోలీసుల అదుపులో విపక్ష నేతలు
పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్, విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. నినాదాలు చేస్తున్న నేతలను బలవంతంగా బస్సుల్లోకి తరలించి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో ఈసీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
