Hyundai Bayon SUV
* కారులోనే జనరేటివ్ ఏఐ అసిస్టెంట్
* 23 అడాస్ ఫీచర్లు
* అక్టోబర్ 26న భారత మార్కెట్లో విడుదల
Hyundai Bayon SUV| ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లోకి మరో కొత్త SUVను తీసుకొచ్చింది. ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందించిన ‘హ్యుందాయ్ బేయాన్’ (Hyundai Bayon)ను అక్టోబర్ 26న అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.9,99,900గా నిర్ణయించింది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను అందించడం విశేషం. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, రూ.11 వేల టోకెన్ మొత్తంతో ఆన్లైన్లో లేదా అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.
కారులోనే జనరేటివ్ ఏఐ
హ్యుందాయ్ బేయాన్‌లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్. పెర్ప్లెక్సిటీ (Perplexity), సౌండ్‌హౌండ్ ఏఐ (SoundHound AI) సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. డ్రైవింగ్ చేస్తూనే సాధారణ సంభాషణల తరహాలో ప్రశ్నలు అడిగి ప్రయాణ సమాచారం, వాతావరణం, హోటళ్లు, రెస్టారెంట్లు, వార్తలు, క్రీడలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
డ్యాష్‌బోర్డుపై 12.3 అంగుళాల రెండు కర్వ్డ్ పనోరమిక్ డిస్ప్లేలను ఏర్పాటు చేశారు. ఎన్విడియా ఆధారిత కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 70కి పైగా బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్లు, 19 కంట్రోలర్ల వరకు ఓవర్ ది ఎయిర్ (OTA) అప్డేట్స్ సదుపాయం ఉన్నాయి. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది.
115 పీఎస్ పెట్రోల్ ఇంజిన్
ఈ SUVలో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల MPI పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 115 పీఎస్ గరిష్ఠ శక్తితో పాటు 143.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (iVT) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
ఐవీటీ వేరియంట్లో డ్యాష్ బూస్ట్ మోడ్, స్పోర్టీ డ్రైవ్ టెక్నాలజీ ప్రత్యేకతలు. ఓవర్‌టేకింగ్ సమయంలో మెరుగైన స్పందన కోసం డ్యాష్ బూస్ట్ మోడ్ ఉపయోగపడుతుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్లతో పాటు ప్యాడిల్ షిఫ్టర్లను కూడా అందించారు.
భద్రతలోనూ అధునాతన ఫీచర్లు
భద్రత విషయంలో హ్యుందాయ్ బేయాన్‌లో 23 అధునాతన ADAS ఫీచర్లతో కూడిన స్మార్ట్‌సెన్స్ లెవల్-2 ప్రో టెక్నాలజీని అందించారు. హైవే డ్రైవింగ్ అసిస్ట్, నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, సర్వౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు. మొత్తంగా 80కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రీమియం ఇంటీరియర్.. సౌకర్యవంతమైన ప్రయాణం
కారు లోపలి భాగంలో లెదరెట్ సీట్లు, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా వంటి సదుపాయాలు వేరియంట్‌ను బట్టి లభిస్తాయి. 505 లీటర్ల బూట్ స్పేస్ ఉండటంతో కుటుంబ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.
ఏడాదికి 2.5 లక్షల అమ్మకాల లక్ష్యం
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సాంకేతికత, భద్రత, సౌకర్యాలను కలిపి బేయాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. క్రెటా, బేయాన్ మోడళ్ల ద్వారా ఏడాదికి 2.5 లక్షలకు పైగా వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
భారత్‌లోనే బేయాన్‌ను తయారు చేయనున్న హ్యుందాయ్.. 50కి పైగా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. మాన్యువల్, ఐవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పలు వేరియంట్లలో ఈ SUV అందుబాటులో ఉంటుంది. మిడ్ సైజ్ SUV విభాగంలో మారుతీ విక్టోరిస్, కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి మోడళ్లతో బేయాన్ పోటీ పడనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

