డి.ఎస్. లోకేష్ కుమార్
* రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
* అధికారులకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాలు
ఆకేరు న్యూస్, ములుగు: భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతోపాటు, జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ కేసులు, భూదాన్ నివేదిక, రీసర్వే, హైకోర్టు కేసులు, భూభారతి పాత, కొత్త దరఖాస్తులు, భూసేకరణ, భూముల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి సంబంధిత అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. భూభారతి కింద పరిష్కారం కాకుండా ఉన్న పాత, కొత్త దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హమైన వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలు
రీసర్వే ప్రక్రియను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పూర్తి చేసేందుకు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను కేటాయించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పనులు వేగంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
జీవో 59, 76 దరఖాస్తులకు గడువు
జీవో నంబర్లు 59, 76 కింద భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. యూఎల్సీ భూములు, జీవో నంబర్ 118కు సంబంధించిన పెండింగ్ అంశాలపైనా సమీక్షించారు. హైకోర్టులో విచారణలో ఉన్న భూ సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే విజిలెన్స్ కేసులు, భూదాన్ భూములకు సంబంధించిన నివేదికలు, భూసేకరణ అంశాల్లో పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో కృష్ణవేణి, ఏవో రాజ్‌కుమార్, పర్యవేక్షకులు మహేష్ బాబు, మంజుల, తహసీల్దార్ విజయభాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

