AP DSC 2026
* టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అలర్ట్..
* దరఖాస్తులకు తేదీలు ఖరారు
* ఏపీ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకూ రాతపరీక్ష
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నవంబర్ 4న ఈ నోటిఫికేషన్ వెలువడగా.. నవంబర్ 11 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* మూడు విభాగాల్లో పోస్టుల భర్తీ..
మొత్తం 2,721 పోస్టులను మూడు విభాగాలుగా విభజించారు. సాధారణ ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2,111 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి 350 పోస్టులు, సొసైటీ పాఠశాలల పరిధిలో మరో 260 పోస్టులు కేటాయించారు.
సాధారణ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉండగా.. ప్రత్యేక విద్య విభాగంలోనూ ఈ రెండు కేటగిరీల్లో నియామకాలు చేపట్టనున్నారు. సొసైటీ పాఠశాలల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* నవంబర్ 11 నుంచి దరఖాస్తులు..
డీఎస్సీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 11న ప్రారంభమై నవంబర్ 30తో ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను పూర్తిస్థాయి నోటిఫికేషన్లో పరిశీలించాలి.
* డిసెంబర్ 20 నుంచి పరీక్షలు
అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) రాతపరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 20 నుంచి 2027 జనవరి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 14 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కూడా రాతపరీక్ష నిర్వహించనున్నారు.
* అధికారిక వెబ్సైట్లో వివరాలు
డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్, దరఖాస్తు విధానం, అర్హతలు, పరీక్షల షెడ్యూల్ తదితర వివరాలను అభ్యర్థులు ఏపీ పాఠశాల విద్యాశాఖ నియామక పోర్టల్లో తెలుసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్: https://tet2dsc.apcfss.in

Please tell us what is wrong. Your report will be sent to the website team.

