Warangal Collector Review Gurukulam Students Health
* పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ
* విద్యార్థినులతో కలెక్టర్ ముఖాముఖి
* సమస్యలు చెబితే పరిష్కరిస్తాం
ఆకేరు న్యూస్, వరంగల్: గురుకుల విద్యార్థినుల ఆరోగ్యం, పౌష్టికాహారం విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద (Collector Satya Sharada) సూచించారు. వరంగల్ ఉర్సులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, పౌష్టికాహారం నాణ్యత, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న ఆహారం, ఇతర సదుపాయాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంతో అవసరమని, ఆహారం అందించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. చలికాలంలో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చలి నుంచి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

* సమస్యలను ఫిర్యాదు పెట్టెలో తెలియజేయాలి
గురుకులంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వాటిని తన దృష్టికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెను వినియోగించుకోవాలని విద్యార్థినులకు కలెక్టర్ సూచించారు. ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత రెడ్డి, గురుకుల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.

