Hyderabad Lover Murder Case
* హైదరాబాద్‌లో దారుణం
* మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి పరారీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియరాలిని ప్రియుడు హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కేసి నిందితుడు పరారయ్యాడు. ఈ హత్యకు ఆమెపై అనుమానం కూడా ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు.
* పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో రెహానా, మహమ్మద్ సలామ్ అలియాస్ అహ్మద్ అలియాస్ టోటా కలిసి ఉంటున్నారు. వారు ఇద్దరూ ఒకే ఫంక్షన్ హాల్లో లేబర్లుగా పని చేసేవారు. ఆ సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఏడాది కాలంగా వారి ప్రేమ కొనసాగుతోంది. పెళ్లి కాకుండానే బిస్మిల్లా కాలనీలోని ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని రెహానా కొంత కాలంగా అహ్మద్‌ను అడుగుతూ వస్తోంది. అహ్మద్ వాయిదా వేస్తూ వస్తున్నాడు.
* పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో..
తనను తక్షణం పెళ్లి చేసుకోవాలని ప్రియుడు మహమ్మద్ సలామ్ పై రెహానా ఒత్తిడి పెంచింది. పెళ్లి విషయమై ఆదివారం రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగాయి. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నిందితుడు రెహానా మృతదేహాన్ని బెడ్రూమ్లోనే గోనెసంచిలో ప్యాక్ చేశాడు. ఆ సాక్ష్యాధారాలను మాయం చేయడానికి మృతదేహాన్ని ఇంటి నుండి బయటకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు ఉదయం 5 గంటల ప్రాంతంలో ‘డైల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
* పరారీలో నిందితుడు
బీహార్ రాష్ట్రానికి చెందిన అహ్మద్ హత్య అనంతరం పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ హత్యను నిందితుడు సలామ్ ఒక్కడే చేశాడా? లేదా శవాన్ని తరలించడంలో ఎవరైనా సహాయం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. రెహానా మరో యువకుడితో సన్నిహితంగా ఉందన్న అనుమానం కూడా ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
