Allu Arjun Sandhya Theatre Case
* ఆన్లైన్ విచారణ నడువది.. కోర్టుకు రావాల్సిందే
* అల్లు అర్జున్ ముచ్చట తిరస్కరించిన కోర్టు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు విచారణకు సంబంధించి ఆన్లైన్ (వర్చువల్) ద్వారా హాజరవుతానంటూ అల్లు అర్జున్ పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన లాయర్ ద్వారా ఆన్లైన్ విచారణకు అనుమతించాలని కోర్టును కోరారు. అయితే, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.
* కోర్టు ఆదేశాల ప్రకారం..
ఈ సోమవారం జరగనున్న మొదటి విచారణకు అల్లు అర్జున్ స్వయంగా నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసులోనే బన్నీ సోమవారం న్యాయస్థానం ముందుకు రానున్నారు.
