Kunamneni Sambasiva Rao
Kunamneni Sambasiva Rao | అకేరు న్యూస్, హనుమకొండ: శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని సూచించారు.
ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం హనుమకొండలో నిర్వహించిన భారీ విద్యార్థి ప్రదర్శన, బహిరంగ సభలో కూనంనేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పబ్లిక్ గార్డెన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన కేయూ క్రాస్‌రోడ్ మీదుగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం వరకు సాగింది. వేలాది మంది విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని కూనంనేని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని సూచించారు. భగత్‌సింగ్, స్వామి వివేకానంద, మహాకవి శ్రీశ్రీ వంటి మహనీయుల స్ఫూర్తితో సామాజిక మార్పులో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులదే మార్పు శక్తి
ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగి రాజన్ మాట్లాడుతూ దేశంలో మార్పు తీసుకురాగల శక్తి విద్యార్థులదేనన్నారు. భగత్‌సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బిర్సా ముండా స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేయూ ఆడిటోరియంలో ప్రజానాట్యమండలి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
