Say No to Drugs rally Hanamkonda
* యువత మేలుకో.. మత్తును వీడు…
* ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్, సీపీ…
ఆకేరు న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా హనుమకొండ జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక పోరు ఉధృతమైంది. శనివారం ఉదయం హనుమకొండలో “Say No to Drugs” అంశంపై భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. సమాజంలోని యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.
* ర్యాలీ ప్రారంభించిన సీపీ…
హనుమకొండలోని చారిత్రాత్మక అదాలత్ సర్కిల్ వద్ద ఈ ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఛాహాత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. అదాలత్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి గుండా సాగుతూ హనుమకొండ కలెక్టరేట్ వరకు చేరుకుంది. ర్యాలీ పొడవునా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ నినాదాలు చేశారు.
* అధికారుల పిలుపు – మానవహారం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాలనే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్షణికానందం కోసం డ్రగ్స్ వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, క్రీడలు, విద్యా రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద భారీ మానవహారం నిర్వహించి, డ్రగ్స్ వినియోగించబోమని, ఇతరులను కూడా దీనికి దూరంగా ఉంచుతామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
* పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సమన్వయంతో భారీగా తరలివచ్చారు. పాల్గొన్న వారిలో
డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి (DWO) విశ్వజ,
ఇతర విభాగాల పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఈగల టీం సభ్యులు, ఆశా వర్కర్లు మరియు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా హనుమకొండను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
